అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలుగు సంవత్సరంలో ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకమైనది. శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఏకాదశి, తొలి ఏకాదశి ఈ మాసంలోనే ఉంటుంది. ఈ నెలలోనే సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో.. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమంటారు. ఆషాఢంలో చేసే దానం, జపం, పారాయణం విశేష ఫలితాన్నిస్తాయంటారు. ఈ మాసంలో నదీ స్నానాలు ముక్తిదాయకమని చెబుతారు. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల విశిష్ట ఫలితమిస్తుందని విశ్వాసం. ఇదే నెలలో తెలంగాణ సంబరమైన బోనాల ఉత్సవాలు నిర్వహిస్తారు. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, ఊర పండుగ.. ఇలా ఎన్నో విశిష్టతలు మోసుకొచ్చే మాసమే ఆషాఢం.
అందుకే ఆషాఢమనే పేరు..
ఈ మాసంలో పుర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలొస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడు ఈ రెండిరటి మధ్య ఉంటాడు. అందుకే ఆషాఢమనే పేరు వచ్చిందంటారు. జులై 6న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది.
తొలి ఏకాదశి
శుద్ధ ఏకాదశి రోజు విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రత దీక్ష ప్రారంభమవుతుంది.
గురు పౌర్ణమి..
ఆషాఢంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురుపూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహా భాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
జగన్నాథ రథయాత్ర
ఆషాఢశుద్ధ విదియ రోజున(జులై 7) పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కనుల పండువగా జరుగుతుంది. జిల్లా కేంద్రంలోనూ ఈ ఏడాది కంఠేశ్వర్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో భారీ జగన్నాథ రథయాత్ర నిర్వ హించనున్నారు. నీలకంఠేశ్వరాలయం నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్దబజార్, ఆర్ఆర్ చౌరస్తా, పూలాంగ్ మీదుగా విజయలక్ష్మి గార్డెన్ వరకు కొనసాగనుంది.
ఆహార నియమాలు
వర్షాకాలం కావడంతో ఈ నెలలో విపరీతమైన ఈదురుగాలులతో వర్షాలు పడతాయి. దీంతో కాల్వలు, నదుల్లో ప్రవహించే కొత్త నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోకి అపరిశుభ్రమైన నీరు చేరుతుంది. అందుకే అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు.. ఏదిపడితే అది తినకూడదని, ఆహార నియమాలు పాటించమని పెద్దలు చెబుతుంటారు.
శుభకార్యాలు ఎందుకు వద్దంటారంటే..
ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాల కడలిపై యోగనిద్రలోకి వెళ్తాడు. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. విష్ణుమూర్తిని పూజించడం, మంత్రాలను జపించడం మాత్రం శుభప్రదంగా పరిగణిస్తారు.
నవ దంపతులకు ఎడబాటు
వాతావరణ మార్పు.. అధిక వర్షాలు కురవడంతో పరిసరాల అపరిశుభ్రత వల్ల వ్యాధులు ప్రబలుతాయి. ఈ సమయంలో నవ దంపతుల కలయిక వల్ల పుట్టబోయే పిల్లలు అనారోగ్యంగా, బలహీనంగా ఉండే ప్రమాదం ఉందని పెద్దలు భావిస్తారు. అందుకే నవ దంపతులు కలవకూడదనే నియమం తీసుకొచ్చారు. దీన్నే ఆనవాయితీగా కొనసాగిసున్నారు. మరో కథనం ఏమిటంటే.. మనది వ్యవసాయాధారిత దేశం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు. ఆషాఢ మాసంలో వర్షాలు కురవడంతో సాగు పనులు మొదలవుతాయి. కొత్తగా పెళ్లయిన కొడుకు ఈ సమయంలో పొలం పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే.. సాగు పనులు జరగవని అనుకుంటారు. ఈ కారణంగానే ఆషాఢ మాసంలో అత్తా, కోడళ్లు ఒకరి ముఖం మరొకరు చూసుకోవద్దనే ఆనవాయితీ వచ్చింది. నూతనంగా ఇంటికి వచ్చిన కోడలిని ఆషాఢంలో పుట్టింటికి పంపే ఆచారం కొనసాగుతూ వస్తోంది.
తెలంగాణలో బోనాల సంబరాలు
అమావాస్య తర్వాత వచ్చే గురువారం నుంచి తెలంగాణలో బోనాల సంబరాలు మొదలవుతాయి. హైదరాబాద్ గోల్కొండ కోటలోని జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో తొలి పూజ చేశాకే.. రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి మొదలవుతుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహాకాళి బోనాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసం చివరి రోజున తిరిగి గోల్కొండ కోటలో చివరి బోనంతో పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు. గోల్కొండలో ఉండే జగదాంబిక అమ్మవారికి తొలి బంగారు బోనం సమర్పించే ఆనవాయితీ కుతుబ్ షా కాలం నుంచి కొనసాగడం విశేషం.
పితృదేవతలకు ప్రీతికర మాసం
సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుం ది. ఈ మాసం పితృదేవతలకు ప్రీతికరం. అందుకే శుభ ముహూర్తాలు ఉండవు. ప్రాంతాలను బట్టి ఆషాఢంలో బోనాలు సమర్పించి గ్రామ దేవతలను పూజిస్తారు.
– గుడి శ్రీనాథ్, కృష్ణ యజుర్వేద స్మార్త పండితులు