అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Toll Charges | ప్రస్తుతం సొంత వాహనంలో దేశంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇంధన ధరలతో పాటు, టోల్ ఛార్జీల(Toll Charges) గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో రహదారులను(Roads) అభివృద్ధి చేస్తున్న కేంద్రం టోల్(Toll) పేరిట వసూళ్లు కూడా బాగానే చేస్తోంది. జాతీయ రహదారులతో పాటు ఇతర రోడ్లలో కూడా టోల్ బూత్‌లు ఉండటంతో ఒక్కసారి బయటకు వెళ్తే టోల్ మోత మోగడం ఖాయాం. ప్రస్తుతం దేశంలో సుమారు 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అయితే టోల్‌ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) ఫాస్టాగ్(Fastag) విధానం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా కొత్త రూల్ కూడా ప్రవేశపెట్టింది.
Toll Charges | 10 సెకన్ల రూల్
ప్రజలు తమ వాహనాలతో టోల్ ప్లాజాల వద్ద నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు వేచి ఉంటే టోల్ రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఇదే పది సెకన్ల రూల్. దీని ప్రకారం ఒక వాహనం టోల్ గేట్ దగ్గరికి వచ్చిన ఐదు నిమిషాల్లోపు వెళ్లిపోవాలి. అంతకుమించి పది సెనక్లు ఆలస్యమైనా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేగాకుండా టోల్ బూత్‌ల వద్ద వంద మీటర్ల కంటే ఎక్కువ దూరం వాహనాలు బారులు తీరి ఉండొద్దు. రద్దీ సమయాల్లోనూ ఈ రూల్ వర్తిస్తుంది. ప్రజల సమయాన్ని ఆదా చేయడం కోసం ఎన్హెచ్ఏఐ ఈ రూల్‌ను 2021లో తీసుకు వచ్చింది.
Toll Charges | వీరికి మినహాయింపు..
టోల్ ప్లాజాల వద్ద బైక్‌లు, ఆటోలతో పాటు పలు వాహనాలకు ఫీజు మినహాయింపులు ఉంటాయి. ఆర్మీ, పోలీసు, అంబులెన్స్, ఫైర్, అంతిమ యాత్ర వాహనాలు టోల్ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అంతేగాకుండా ఆయా టోల్ బూత్‌కు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. స్థానిక ప్రజలు తమ వాహనాలపై నిరంతరం వెళ్లాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనను రూపొందించారు. అయితే కమర్షియల్ వాహనాలకు మాత్రం ఈ అవకాశం లేదు. స్థానికులై ఉండి.. టోల్ ట్యాక్స్ మినహాయింపు కావాలంటే.. లోకల్ రెసిడెంట్ లేదా నెలవారీ పాస్ తీసుకోవాలి.
Toll Charges | కొత్త సిస్టం వస్తే 20 కి.మీ ఫ్రీ
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం(GNSS) ద్వారా టోల్ వసూలు చేయాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. దీనిప్రకారం వాహనానికి ఉన్న జీపీఎస్ ఆధారంగా ఆయా రహదారులపై ఎంత దూరం వెళ్తే దాని ప్రకారం టోల్ఛార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజులో మొదటి 20 కిలోమీటర్లు ఫ్రీగా ప్రయాణించవచ్చని ఎన్హెచ్ఏఐ తెలిపింది. ఆ తర్వాత ప్రయాణించిన దూరానికి టోల్ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.