అక్షరటుడే, బోధన్: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. సోమవారం బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన సభలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ నేత కావడంతో రకరకాల వ్యూహాల కారణంగా ఆయన రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, ఈటల ఎన్ని చోట్ల పోటీ చేసినా అంతిమంగా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వాగతమని, వచ్చి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడాలన్నారు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును ప్రకటించాలని, తక్షణమే బీసీలకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు.