రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడు నెలలు గడిచింది. ఒకవైపు సర్కారు ఉద్యోగాల భర్తీకి టీజీఎస్ పీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తోంది. కానీ, ఇంతలోనే నిరుద్యోగుల పోరుబాట కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో సమరమేనని విద్యార్థులు, నిరుద్యోగులు కుండబద్ధలు కొడుతున్నారు. ఆమరణ దీక్షలు, ముట్టడి, ధర్నాలతో తమ నిరసన గళం వినిపిస్తున్నారు. నిరుద్యోగుల తరఫున ప్రస్తుతం బక్క జడ్సన్, అశోక్ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావడం లేదని వారు పేర్కొంటున్నారు.
ఆందోళనకరంగా నిరుద్యోగిత రేటు
రాష్ట్రంలో పట్టభద్రులైన నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. డిగ్రీలు, ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగాలు, ఉపాధి దొరకడం లేదు. తెలంగాణలో చదువుకున్న 15-29 ఏళ్ల యువతలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు నిరుద్యోగిగా ఉంటున్నారు. జాతీయస్థాయిలో సగటు నిరుద్యోగ రేటు(16.5%)ను మించిపోయింది. రాష్ట్రంలో యువ నిరుద్యోగ రేటు 22.9 శాతంగా ఉండడం ఆందోళనకరం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ రేటును పరిశీలిస్తే.. రాష్ట్ర ర్యాంకు చివరి నుంచి ఆరో స్థానంలో ఉండడం గమనార్హం. అభివృద్ధిలో తెలంగాణ కన్నా అత్యంత వెనుకబడిన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల కన్నా గణాంకాలు దారుణంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 2023 అక్టోబరు- డిసెంబరు కాలానికి కార్మిక బలగం గణాంకాలను కేంద్ర గణాంకశాఖ ఇటీవల విడుదల చేసింది.
ప్రత్యేక రాష్ట్రంలో..
తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పాలనలో 2015 నుంచి 2022 వరకు టీఎస్పీఎస్సీ ద్వారా 36,886 ఉద్యోగాలను భర్తీ చేసింది. అందులో కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాలు 128, గ్రూప్-2 ఉద్యోగాలు 1,032 ఉన్నాయి. 1,058 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు, 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలు ఉన్నాయి. గత ప్రభుత్వం 108 నోటిఫికేషన్లు విడుదల చేసింది.
కాంగ్రెస్ పాలనలో ఇలా..
- రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తాజాగా విడుదల చేసింది. 1:50 ప్రాతిపదికన 31వేల మంది అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ విషయంలోనూ నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు 1:100గా ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- గత ప్రభుత్వం కీలకమైన 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. రెండుసార్లు పరీక్ష నిర్వహించినా.. టీఎస్పీఎస్సీలో అవినీతి, అక్రమాల వల్ల రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక మరో 60 గ్రూప్-1 పోస్టులను భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులను చేర్చి, మొత్తం 563 పోస్టుల భర్తీకి ప్రక్రియ చేపడుతోంది.
- 2022లో విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి ఇటీవలే పరీక్ష నిర్వహించింది.
- త్వరలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
- గతేడాది జరిగిన జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేసింది.
త్వరలో గవర్నర్‌కు ఫిర్యాదు
మరోవైపు నిరుద్యోగుల ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. తమ ఆందోళనలకు దిగిరాని రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని జేఏసీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకను నిలదీయడానికి త్వరలోనే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొంటున్నారు.
-నరేశ్ చందన్