అక్షరటుడే, వెబ్‌డెస్క్: Special Branch police | నిజామాబాద్ కమిషనరేట్(Nizamabad Commissionerate) స్పెషల్ బ్రాంచ్‌ను సీపీ సాయి చైతన్య(CP Sai Chaitanya) ప్రక్షాళన చేశారు. పలుమార్లు ఈ విభాగంపై సమీక్ష జరిపిన ఆయన ఫీల్డ్ సిబ్బందిని బదిలీ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్థానాల నుంచి కొత్త స్థానాలకు మార్చారు. కాగా.. ఈ చర్యతో ఎస్బీలో మార్పు కనిపిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. కానీ ఓ అధికారి మాత్రం ఈ విభాగంలో ఏళ్లుగా తిష్ట వేసి ఉండటం, ఆయనను ఎక్కడికి బదిలీ చేయకపోవడం చర్చకు దారి తీసింది.
పోలీస్ శాఖ(Police department)లో స్పెషల్ బ్రాంచ్ (Special Branch) అధికారులు, సిబ్బంది పాత్ర అత్యంత కీలకం. కిందిస్థాయి నుంచి ఫీల్డ్ అధికారులు ఎప్పటికప్పుడు అందించే సమాచారం, నివేదికల ఆధారంగానే శాంతిభద్రతల నిర్వహణతో పాటు, పోలీస్ శాఖ పనితీరు ఆధారపడి ఉంటుంది. ఒకవిధంగా పోలీస్ బాస్‌లు వీరి మీదనే ఆధారపడి పనిచేయాల్సి ఉంటుంది. ఈక్రమంలోనే తాజాగా ఎస్బీలో ప్రక్షాళన జరిపినట్లు చర్చ జరుగుతోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏళ్లుగా ఈ విభాగంలో తిష్ట వేసిన ఓ అధికారి కనుసన్నల్లో ఫీల్డ్ ఆఫీసర్లు అంతా ఇదివరకు పనిచేసినట్లు ప్రచారంలో ఉంది. గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు సైతం సదరు అధికారి మాటకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారని ప్రచారం సాగింది. స్పెషల్ బ్రాంచ్ లో ఏసీపీ(Special Branch ACP), సీఐ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ.. వారికంటే కిందిస్థాయి హోదా కలిగిన ఈ అధికారే.. విభాగాన్ని శాసించారనే ప్రచారంలో ఉంది. ప్రత్యేకించి గతంలో పలువురు కానిస్టేబుళ్లను అకారణంగా బదిలీ చేయించారని కమిషనరేట్‌లో కోడై కూసింది. అప్పట్లో జరిగిన ఈ బదిలీల కారణంగా పలువురు కోర్టు డ్యూటీ అధికారులు అకారణంగా తాము బలి అయ్యామని పై అధికారులకు విన్నవించారు.
Special Branch police | అలవెన్సుల కేటాయింపుపై చర్చ
సదరు అధికారి పోస్టింగ్ నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్(Traffic Police Station)లో కానీ, అటాచ్‌మెంట్‌పై ఎస్బీలో కొనసాగుతున్నారు. గతంలో పలు జిల్లాలకు బదిలీ చేసినా.. ఆ వెంటనే సదరు ఉత్తర్వులను రద్దు చేయించుకొని ఇక్కడే కొనసాగుతున్నారు. ట్రాఫిక్ విభాగంలో ఉండి ఫీల్డ్‌లో పని చేసేవారికి మాత్రమే 30 శాతం అలవెన్సులు చెల్లిస్తారు. ఒకవేళ ట్రాఫిక్‌లో పోస్టింగ్ ఉండి, ఇతర విభాగాలకు అటాచ్ అయితే అలవెన్స్‌లు ఇవ్వరు. కానీ ఈ అధికారికి మాత్రం గత కొన్నేళ్లుగా ట్రాఫిక్ అలవెన్సులు జారీ చేస్తుండడం కొసమెరుపు.