అక్షరటుడే, ఇందూరు: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతు భరోసా హామీ నెరవేర్చకపోవడం దురదృష్టకరమన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ పథకం విషయంలో రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులకు ఏడాదికి రూ. 15వేల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. అలాగే వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి రూ. 12వేలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, నూతల శ్రీనివాసరెడ్డి, భరత్ భూషణ్, హరీశ్ రెడ్డి, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.