అక్షరటుడే, బాన్సువాడ: కోళ్ల ఫాం ఏర్పాటు కోసం ఒకరు, ఇంటి రుణం కోసం మరో ఇద్దరు పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసిన ఘటన నసురుల్లాబాద్ మండలం హాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఇంటి రుణం ఈఎంఐ చెల్లించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన మంగ్యా సర్వే నంబర్ 22/4/1 కోళ్ల ఫాం ఏర్పాటుకు ఎన్ఓసీ కోసం నకిలీ ధ్రువపత్రం సృష్టించాడు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రజిత సంతకం ఫోర్జరీ చేసి స్టాంపులు వేసి విద్యుత్తు శాఖ ఏఈకి అందజేశాడు. అదే గ్రామానికి చెందిన నెనావత్ శ్రీకాంత్, సలావత్ శ్రీను గ్రామ పంచాయతీ స్టాంపులు, రశీదులు, ధ్రువపత్రాలు నకిలీవి సృష్టించి ఆరు నెలల కిందట ప్రైవేట్ ఫైనాన్స్ లో రూ.9 లక్షలు రుణం తీసుకున్నారు. నాలుగు నెలల పాటు ఈఎంఐలు సక్రమంగా చెల్లించిన సదరు వ్యక్తులు గత రెండు నెలలుగా చెల్లించట్లేదు. దీంతో ఈ విషయం బయటపడింది. సదరు ధృవపత్రాలపై సంతకం తనది కాదని కార్యదర్శి రజిత తెలిపారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై బుధవారం నసురుల్లాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ
Advertisement
Advertisement