అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. సంపూర్ణ ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదనేది కాదనలేని సత్యం. నేటి బిజీ లైఫ్‌లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిత్య జీవితంలో ఈ నాలుగు అలవాట్లు భాగమైతే జీవితం సాఫీగా సాగుతుందంటున్నారు ప్రముఖ న్యూట్రీిషనిస్ట్‌, లైఫ్‌ కోచ్‌ కీర్తి లాబిశెట్టి. ప్రతిఒక్కరికి సమతుల్య ఆహారం, వ్యాయామం, మంచి నిద్ర, హైడ్రేషన్‌ అవసరమని పేర్కొన్నారు. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ పాటించడంతో ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు. నిత్య జీవితంలో పాటించాల్సిన హెల్త్‌టిప్స్‌ను ఆమె ‘అక్షరటుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ఆహారంలో సమతుల్యత ఎంతో ముఖ్యం

ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించడం వల్ల ఆరోగ్యకరంగా ఉండవచ్చు. శరీరానికి కార్పొహైడ్రేట్స్‌, ప్రొటీన్స్‌, హెల్దీ ఫాట్స్‌, మైక్రో న్యూట్రియన్స్‌ ఎంతో అవసరం. వాటిని అవసరమైన మేరకు తీసుకోవాలి. అతిగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శరీరతత్వం, వయస్సు ఆధారంగా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.

రోజూ రైస్‌ తినడం వల్ల..

మనం తినే అన్నంపై చాలామందిలో అనేకరకాల అపోహలున్నాయి. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకి మూడుసార్లు తక్కువ మొత్తంలో రైస్‌ తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ప్రతి మీల్‌లో 40 గ్రాముల నుంచి 50 గ్రాములు(శరీరతత్వం, వయస్సు ఆధారంగా) తీసుకుంటే పర్వాలేదు. భోజనంలో అన్నంతో పాటు ఫైబర్‌ కంటెంట్‌ ఉండే కూరగాయాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. షుగర్, పీసీవోడీ లాంటి సమస్యలు ఉన్నవారు తమ ఆహారంలో రైస్‌ కంటెంట్‌ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి.

మోతాదు మేరకు మాంసాహారం

కొందరు నిత్యం మాంసాహారం తీసుకుంటుంటారు. అయితే మోతాదు మేరకు తీసుకోవడం వల్లఇబ్బంది ఉండదు. కానీ అతిగా మీట్‌ తీసుకోవడం వల్ల బాడీలో ఫ్యాట్‌ పర్సంటేజ్‌ పెరుగుతుంది. ముఖ్యంగా రెడ్‌ మీట్‌ తినడం శరీరంలో కొవ్వు స్థాయిలు బాగా పెరుగుతాయి. లీన్‌ మీట్‌ను పరిమితంగా తీసుకోవచ్చు.

తరచూ జంక్‌ ఫుడ్‌ తీసుకుంటే..

చాలా మంది తరచూ జంక్‌ ఫుడ్‌ తీసుకుంటారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. పిజ్జా, బర్గర్‌ లాంటి వాటిలో చీజ్‌, బట్టర్‌, మయోనైజ్‌ అధికంగా ఉంటుంది. కొవ్వు పదార్థాలు అధికంగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతింటుంది.

గైడెన్స్‌ లేకుండా జీరో సైజ్‌ కోసం ప్రయత్నిస్తే ఇబ్బందే..

హీరోయిన్స్‌, ప్రముఖ్య వ్యక్తులను చూసి చాలా మంది యువతులు జీరో సైజ్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫిలిం స్టార్లు తమ కెరీర్‌ కోసం జీరో సైజ్‌ మెయింటెన్‌ చేస్తుంటారు. అందుకోసం న్యూట్రీషియన్స్‌ గైడెన్స్‌ తప్పనిసరిగా తీసుకుంటారు. కానీ అనేక మంది యువతులు తమకు నచ్చినట్లు డైట్‌ పాటిస్తుంటారు. సడన్‌గా ఆహారపు అలవాట్లు మార్చేసుకుంటారు. దీనివల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. చాలా తక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల న్యూట్రీిషన్‌ డెఫిషియన్సీ వస్తుంది. శరీరానికి అవసరమైన న్యూట్రీిషన్స్‌ అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీరో సైజ్‌ మోజు ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం సరైందికాదు. బ్యాలెన్స్‌ డైట్‌ తీసుకోవడమే మేలు.

ఉపవాసాలు చేసేవారు చేయాల్సినవి ఇవే..

వారంలో ఒకరోజు ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. అయితే వారంలో మూడు నాలుగు రోజులు ఉపవాసం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఉపవాసం చేసిన రోజు పండ్లు, హైడ్రెటింగ్ ప్రూట్స్, నీళ్లు తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది.

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే..

ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ అనేది ఈ రోజుల్లో చాలా మంది పాటిస్తున్నారు. అయితే అది మన శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతి పాటించడం వల్ల కల్లు తిరగడం, తలనొప్పి వస్తే ఆపేయాలి. అయితే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లో భాగంగా మరికొందరు రాత్రి ఏడు గంటల్లోపుభోజనం పూర్తి చేసి సుమారు 12 నుంచి 14 గంటల డైట్‌ పాటిస్తున్నారు. ఇది శరీరానికి మేలు చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు విశ్రాంతి ఇవ్వడం వల్ల మేలు జరుగుతుంది. ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ వల్ల ఇబ్బందులు ఎదురైన వాళ్లు క్యాలరీ డెఫిసిటీ పాటించినా సరిపోతుంది. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే మన శరీరానికి అవసరమైన క్యాలరీల కన్న కొంత మేరకు తక్కువగా తినడం అన్నమాట.

ఆహారంలో మోతాదు మేరకే ఆయిల్‌..

రిఫైన్డ్‌ ఆయిల్‌ అధికంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. ప్రతి మీల్‌లో 10 ఎంఎల్‌ వరకు(శరీరతత్వం, వయస్సు ఆధారంగా) ఆయిల్‌ కంటెంట్‌ ఉంటే పర్వాలేదు. అంతకన్నా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇక పేషెంట్స్‌ అయితే న్యూట్రిషన్‌ సలహా మేరకు ఆలివ్‌ ఆయిల్‌, కోల్డ్‌ ప్రెస్‌డ్‌ ఆయిల్స్‌ తీసుకుంటే మేలు.

నిత్య జీవితంలో వ్యాయామం భాగమవ్వాలి

ప్రస్తుత బిజీ లైఫ్‌లో శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాయామంపై శ్రద్ధ కనబర్చకపోవడం అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. అందుకే నిత్య జీవితంలో యోగా, వాకింగ్‌తో పాటు వ్యాయామాన్ని కూడా భాగం చేసుకోవాలి. నీట్‌ యాక్టివిటీస్‌ అయిన యోగా, వాకింగ్‌ చేయడంతో పాటు స్ట్రెంత్ ట్రెయినింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు. అయితే స్ట్రెంత్ ట్రెయినింగ్ బదులు అడ్వాన్స్‌డ్‌ యోగా చేసినా అంతే ప్రయోజనం పొందవచ్చు. వయస్సు పెరిగే కొద్ది ప్రతియేటా ఏజ్‌ రిలేటెడ్‌ సార్కోపెనియా సమస్య వస్తుంది. దీనివల్ల ఏటా ఒక శాతం మజిల్‌ కోల్పోతూ ఉంటాం. స్ట్రెంత్ ట్రెయినింగ్ చేయడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అతిగా వ్యాయామం వద్దు

వ్యాయామాలు చేసేవారిలో చాలామంది తమకు నచ్చినట్లు ఎక్సర్‌సైజ్‌లు చేస్తుంటారు. అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా అనర్థమే. కొందరైతే గంటల కొద్దీ ట్రెడ్‌మిల్‌పై రన్‌ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం తప్పు. హార్ట్‌ డిసీజ్‌, హైబీపీ ఉన్న వారు హై ఇంటెన్సిటీ వ్యాయామం చేయకూడదు. ట్రైనర్‌ పర్యవేక్షణలో ఎక్సర్‌సైజ్‌ చేయడం ఉత్తమం. సాధారంగా శరీరానికి మాడరేట్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ సరిపోతుంది.

సరిపడా నిద్ర అవసరం

మనిషికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో విశ్రాంతి కూడా అంతే అవసరం. బిజీబిజీ జీవితంలో చాలా మందికి సరైన నిద్ర కరువైంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. నిద్రలేమి వల్ల మతిమరుపుతో పాటు హార్మోనల్‌ ఇంబాలెన్స్‌ ఏర్పడుతుంది. దీంతో మానసిక సమస్యలు వస్తాయి. అందుకే నిత్యం కనీసం 8 గంటల పాటు నిద్రపోవడం తప్పనిసరి.