అక్షరటుడే, న్యూఢిల్లీ: NAAC grading : విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు ‘నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్’ (నాక్)(National Assessment and Accreditation Council - NAAC) గ్రేడింగ్ ఇచ్చేటప్పుడు న్యాయంగా, పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర విద్యాశాఖ (Union Education Ministry), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)(University Grants Commission – UGC)లకు దేశ అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు(Supreme Court)లో ఈ పిటిషన్‌ను బిస్త్రో డెస్టినో ఫౌండేషన్(Bistro Destino Foundation) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసింది. కాలేజీలు, వర్సిటీలకు న్యాక్ గ్రేడ్‌లను కేటాయించే ప్రక్రియలో పారదర్శకతపై తమకు కొన్ని సందేహాలు ఉన్నాయని పిటిషన్‌లో ప్రస్తావించింది. ‘న్యాక్’ వ్యవస్థ ప్రస్తుతం పనిచేస్తున్న తీరులో లోపాలు ఉన్నాయని పేర్కొంది. ‘‘అవినీతి అభియోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నాక్ అధికారులపై సీబీఐ(CBI) కేసు నమోదు చేసింది. ఇలాంటి వ్యవహారాల వల్లే నాక్ గ్రేడింగ్, అక్రెడిటేషన్ ప్రక్రియపై సందేహాలు తలెత్తుతున్నాయి. న్యాక్ వ్యవస్థ సవ్యంగా పనిచేస్తోందా..? అనే అనుమానం కలుగుతోంది” అని బిస్త్రో డెస్టినో ఫౌండేషన్ పిటిషన్‌లో వెల్లడించింది.
పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చిలతో (Supreme Court judges Justice P.S. Narasimha, Justice Joy Mallya Bagchi) కూడిన ధర్మాసనం (bench).. వివరణ కోరుతూ విద్యాశాఖ, యూజీసీలకు నోటీసులు జారీ చేసింది. “మేం ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేయదలిచాం. నాక్ పనితీరును సమీక్షించాలని భావిస్తున్నాం’’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది.
‘న్యాక్’ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ(autonomous body). దీనిని 1994లో ఏర్పాటు చేశారు. ఇది యూజీసీ పరిధిలో పనిచేస్తుంది. దేశంలోని కాలేజీలు, విశ్వవిద్యాలయాలకు(colleges, universities) నాక్ గ్రేడింగ్స్ కేటాయిస్తుంటుంది. ఆయా ఉన్నత విద్యా సంస్థల్లోని బోధనా పద్ధతులు, అభ్యసన సౌకర్యాలు, మౌలిక వసతుల(teaching methods, learning facilities, infrastructure) ఆధారంగా న్యాక్ గ్రేడ్ కేటాయింపులు ఉంటాయి.