అక్షరటుడే, వెబ్ డెస్క్: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గురువారం 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం పెద్ద తీవ్రంగా ఉండడంతో అమెరికా పశ్చిమ కోస్ట్‌కు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఒరెగాన్ సరిహద్దుకు 130 మైళ్ల (209 కి.మీ) దూరంలో ఉన్న కోస్టల్ హంబోల్ట్ కౌంటీలోని చిన్న నగరమైన ఫెర్న్‌డేల్‌కు పశ్చిమాన ఉదయం 10:44 గంటలకు భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప ప్రభావం దాదాపు 270 మైళ్ల (435 కి.మీ) దూరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో వరకు చూపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగినట్లు ఇంతవరకు అధికారికంగా ఎలాంటి నివేదికలు వెలువడలేదు. 2019లో రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఆ స్థాయిలో భూకంపం రావడం గమనార్హం.

సునామీ హెచ్చరిక రద్దు..

భూకంపం సంభవించిన కొద్దిసేపటికే సునామీ హెచ్చరిక జారీ చేశారు. దాదాపు 500 మైళ్ల (805 కిమీ) తీరప్రాంతాన్ని కాలిఫోర్నియాలోని మాంటెరీ బే ఉత్తరం నుంచి ఒరెగాన్‌ వరకు దాదాపు గంటపాటు హెచ్చరిక అమలులో ఉంది. కాలిఫోర్నియాలో కనీసం 5.3 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే సునామీ హెచ్చరికను తదుపరి నేషనల్ వెదర్ సర్వీస్ రద్దు చేసిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

150 కంటే ఎక్కువ సునామీలు…

కాలిఫోర్నియాలోని వాయువ్య మూలలో మూడు టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తున్నందున ఈ ప్రాంతం భూకంపాలకు నిలయంగా ఉందని భూకంప శాస్త్రవేత్త లూసీ జోన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కీలో తెలిపారు. కాలిఫోర్నియా జియోలాజికల్ సర్వే 1800 నుంచి 150 కంటే ఎక్కువ సునామీలు తాకినట్లు, చాలా వరకు చిన్నవి అయితే, కొన్ని విధ్వంసకర.. ప్రాణాంతకంగా ఉన్నాయని చెప్పారు.

అలాస్కాలో..

అలాస్కాలో 28 మార్చి, 1964న సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ కొన్ని గంటల తర్వాత క్రెసెంట్ సిటీలోకి దూసుకెళ్లింది. వ్యాపార జిల్లాలో ఎక్కువ భాగం నేలమట్టం చేసింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు.