అక్షరటుడే, వెబ్డెస్క్: MEDAK | తీర్థయాత్రలకు వెళ్తూ.. మార్గమధ్యంలో రోడ్డు పక్కన నిలబడగా.. డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లాకు చెందిన ట్రావెల్స్ బస్సులో భక్తులు తీర్థయాత్రల నిమిత్తం చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట కోలపల్లి గ్రామం వద్ద గురువారం జాతీయ రహదారి పక్కన కాలకృత్యాల కోసం ట్రావెల్స్ బస్సును ఆపారు.
ఇద్దరు మహిళలు అప్పల నారాయణమ్మ(51), సూరప్పమ్మ(65) బస్సు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వారిద్దరిని బలంగా ఢీకొంది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం బస్సును సైతం ఢీకొట్టగా పలువురు ప్రయాణికులకు సైతం గాయాలయ్యాయి.