అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు.. స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాంలో కొద్ది రోజుల కిందట ఇంటి దొంగలు పెద్దఎత్తున బియ్యాన్ని పక్కదారి పట్టించారు. నిజామాబాద్‌ నగర శివారులోని ఖానాపూర్‌ కేంద్రంగా ఉన్న ఎస్‌డబ్ల్యూసీ గోదాం నుంచి నేరుగా మిల్లులకు బియ్యాన్ని తరలించారు. ఈ వ్యవహారంలో సంబంధిత డిపో మేనేజర్‌పై ప్రధాన ఆరోపణలున్నాయి. సదరు కార్పొరేషన్‌ అధికారి తన దగ్గరి బంధువును ఉద్యోగిగా నియమించి అతనితో పాటు మిల్లులకు చెందిన మధ్యవర్తితో కలిసి రూ.కోట్ల విలువ చేసే బియ్యాన్ని రాత్రికిరాత్రి పక్కదారి పట్టించారు. అనంతరం బోధన్‌కు చెందిన ఓ పార్టీ నేతకు సంబంధించిన మిల్లుతో పాటు నగరంలోని మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి మిల్లులకు బియ్యాన్ని తరలించారు. సీఎంఆర్‌ కోటా నింపుకునేందుకు మిల్లర్లు అడ్డదారిలో వచ్చిన బియ్యాన్ని వద్దనకుండా తీసుకున్నారు. ఆ తర్వాత బియ్యం పక్కదారి పట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. అయితే మంచి బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఉద్యోగులు.. తిరిగి నాసిరకం, పురుగులు పట్టిన బియ్యం నిల్వలతో భర్తీ చేశారు. ఈ ఘటన బయటకు పొక్కకుండా ఎక్కడివారక్కడిని సైలెంట్‌ చేశారు. కాగా.. ఇటీవలే ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పొరుగు సేవల్లో పనిచేస్తున్న డిపో మేనేజర్‌పైనే ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయనే ఈ అక్రమ దందాకు తెర తీసినట్లు ప్రచారం జరుగుతోంది. తనకున్న పరిచయాలతో కొంతకాలంగా గోదాం నుంచి బియ్యాన్ని పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. కానీ, ఉన్నతాధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కొసమెరుపు.