సూర్యాపేట జిల్లాలో కీచక ఉపాధ్యాయుడు
అక్షరటుడే, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే.. ఆమె ఇద్దరు కూతుళ్లపై అత్యాచారం చేశాడు. సదరు కీచకుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలడం, కూతుళ్లపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలియడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తి స్థానిక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడి భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. తర్వాత సూర్యాపేటకే చెందిన, భర్తతో విడిపోయిన ఓ మహిళతో 2018 నుంచి సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో 19, 15 ఏళ్లు ఉన్న ఆమె ఇద్దరు కూతుళ్లపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
ఇటీవల సదరు ఉపాధ్యాయుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోగా హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. ఈ విషయం తెలియడంతో పాటు, తమపై కూడా అత్యాచారం చేశాడని ఇద్దరు అమ్మాయిలు చెప్పడంతో తల్లి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లకు హెచ్ఐవీ టెస్ట్ చేసేందుకు శాంపిళ్లు సేకరించారు.