అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. బృందంలో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం తరపున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. కాగా అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీం కోర్టుకు తెలిపారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారని.. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఆరోపణల్లో నిజం ఉంటే మన్నించదగినది కాదని పేర్కొన్నారు. అనంతరం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.