అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాజు, మేనేజర్ హయ్యూమ్ మధ్య గురువారం వాగ్వాదం చోటు చేసుకుంది. మేనేజర్ వ్యక్తిగత పనిపై హైదరాబాద్ వెళ్లేందుకు సెలవు కావాలని కమిషనర్ ను కోరగా, ఇన్ ఛార్జి కమిషనర్ పోస్టు పైరవీ కోసమే సీడీఎంఏ కార్యాలయానికి వెళ్తున్నావని, నాకు అంతా తెలుసంటూ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తానెలాంటి పైరవీ చేయడం లేదని, తన భార్య క్యాన్సర్ చికిత్స కోసమే వెళ్తున్నానని మేనేజర్ చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం మొదలై, ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లినట్లు సమాచారం. ఈ పరిణామంపై మున్సిపల్ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేశారు. కాగా.. మున్సిపల్ లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ప్రక్షాళన చేయాల్సిన అధికారులే ఇందుకు సహకరిస్తున్నారు.