అక్షరటుడే, హైదరాబాద్‌: ఉమ్మడి క‌రీంన‌గ‌ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెద‌క్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న స‌మ‌యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వ‌తంత్రంగా నామినేష‌న్ వేసిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థి డీఎస్పీ గంగాధ‌ర్ బుధ‌వారం కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రి శ్రీధ‌ర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.

Advertisement
Advertisement

ఓట్లు చీల‌కుండా..

గంగాధ‌ర్ ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధ‌ర్ బాబు బుధ‌వారం బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యానికి పిలిపించుకున్నట్లు తెలిసింది. ఈ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌కుండా ఉండేందుకు అవ‌గాహ‌న కుదుర్చుకున్న‌ట్లు సమాచారం. ఓటమి భయంతో ఈ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పోటీలో దిగనట్లు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క బీజేపీ మాత్ర‌మే గ‌ట్టి పోటీ ఇస్తోంది. ఈ త‌రుణంలో స్వ‌తంత్ర అభ్య‌ర్థి గంగాధ‌ర్ చేస్తున్న ప్ర‌చారం వ‌ల్ల కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండే ఓట్లు చీలే అవ‌కాశం ఉన్న‌ట్లు భావించిన ఆ పార్టీ అధిష్ఠానం.. ఓట్లు చీల‌కుండా చూసుకోవడంతో పాటు కాంగ్రెస్ లబ్ధి పొందేలా గంగాధ‌ర్ తో చ‌ర్చ‌లు జరిపినట్లు తెలుస్తోంది.

టికెట్ ఆశించి భంగపాటు

గంగాధ‌ర్ నాలుగు నెల‌ల క్రితం డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెద‌క్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు విస్తృత ప్రచారం చేశారు. ఇందుకు తన వ్యక్తిగత జీవితాన్నే ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. కాంగ్రెస్ టికెట్ ఆశించారు. అయితే ఆ పార్టీ అధిష్ఠానం ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో డిసప్పాయింట్ అయ్యారు. అనంతరం స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బరిలోకి దిగారు.

ఇది కూడా చ‌ద‌వండి :  CM Revanth Reddy | రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కుట్ర

పదవి ఆఫర్ చేశారా..

గంగాధ‌ర్ పోటీ నుంచి తప్పుకొనేందుకు కాంగ్రెస్ ఉన్నత పదవి ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికితోడు నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా, కాంగ్రెస్ అభ్య‌ర్థి డబ్బులు కూడా ఆఫర్ చేసినట్లు ప్రచారంలో ఉంది.

పలు విమర్శలు

గంగాధర్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి చాలా వర్గాలు ఆయనకు మద్దతు తెలిపాయి. ఇటీవల కొందరు చందాలు వేసి మరీ డబ్బులు సమకూర్చారు. అణగారిన వర్గానికి చెందిన గంగాధర్ కు అండగా నిలిచారు. కానీ సడెన్ గా కాంగ్రెస్ పార్టీ పంచన చేరడంతో అందరూ విస్తుపోతున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ, అందరిలో ఒకరిలా కలుపుగోలుగా తిరుగుతూ అందరికీ దగ్గరైన గంగాధర్.. ఒక్కసారిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడాన్ని జీవించుకోలేకపోతున్నారు. తన వ్యక్తిగత కష్టాల కడలి జీవితాన్ని పంచుకుంటూ అందరికీ దగ్గరై, వారినే తన బలంగా ప్రదర్శించుకొని తన రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ లో చేరారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ద్విముఖ పోటీనే..

గంగాధ‌ర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకొన్నట్లే. ఇక ఉమ్మడి క‌రీంన‌గ‌ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెద‌క్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల మధ్యే పోటీ ఉండనుంది.

Advertisement