అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఏటీఎంలో నగదు తీసుకోడానికి వచ్చిన రైతును ఏమార్చి ఓ వ్యక్తి రూ.30 వేలు స్వాహా చేశాడు. మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి గ్రామానికి చెందిన చిన్నొళ్ల గంగారెడ్డి మంగళవారం నిజామాబాద్ కు వచ్చాడు. డబ్బులు డ్రా చేయడానికి రైల్వే స్టేషన్ ప్రాంతంలోని ఎస్బీఐ ఏటీఎంలోకి వెళ్లాడు. తాను తీస్తే ఏటీఎంలో నుంచి డబ్బు రాకపోవడంతో అక్కడే ఉన్న వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి రూ.ఐదు వేలు ఏటీఎం నుంచి తీసి ఇచ్చాడు. అనంతరం గంగారెడ్డికి వేరే ఏటీఎం కార్డు ఇచ్చాడు. అది గమనించకుండా వెళ్లిన ఆయనకు కొద్ది సేపటి తర్వాత ఖాతాలో నుంచి డబ్బులు డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. కార్డు మార్చిన దుండగుడు గంగారెడ్డి అకౌంట్ నుంచి రూ.30 వేలు డ్రా చేశాడు. దీంతో బాధితుడు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.