అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ నగరానికి చెందిన ఓ మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు రూ.కోట్లతో ఉడాయించాడు. నాందేవ్‌వాడ కేంద్రంగా ఏజెన్సీ నడిపిస్తున్న సదరు వ్యక్తి కుటుంబీకులతో కలిసి గాయత్రీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన సదరు వ్యక్తి ఏళ్లుగా మెడికల్‌ ఏజెన్సీ నిర్వహిస్తుండడంతో పాటు నెలనెలా రూ. కోట్లలో టర్నోవర్‌ జరుగుతుండడంతో పలువురు ఇతనికి పెద్దమొత్తంలో అప్పులిచ్చారు. ఈ జాబితాలో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్‌, హైదరాబాద్‌, విజయవాడకు చెందిన బడా ఏజెన్సీల నిర్వాహకులు, వైద్యులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులున్నారు. ఏజెన్సీలకు పెద్దమొత్తంలో చెల్లించాల్సి ఉండగా.. కొందరి నుంచి రూ. లక్షల్లో అప్పులు తీసుకున్నాడు. నేడురేపు డబ్బులు చెల్లిస్తానని చెప్పి తీరా ఈనెల 16 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్‌లు స్విచ్చాఫ్‌ ఉండగా.. ఏజెన్సీ, ఇంటికి తాళాలు వేసి ఉన్నాయి. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకుడు మార్కెట్లో ఇవ్వాల్సిన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది.