అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుడు బ్యాగు మరిచిపోగా.. రైల్వే పోలీసులు తిరిగి అప్పగించారు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి నుంచి నిజామాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడు మామిడాల నర్సయ్య ఉదయం 7 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లోనే బ్యాగు మరిచిపోయి వెళ్లిపోయాడు. బ్యాగులో ఉన్న ఏటీఎం ఆధారంగా వివరాలు తెలుసుకున్న రైల్వే పోలీసులు నర్సయ్యకు ఫోన్‌ చేశారు. బ్యాగులో రూ.1,08,500తో పాటు తులంన్నర బంగారు ఆభరణాలు ఉండగా ప్రయాణికుడు నర్సయ్యకు వాటిని అందజేశారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ కుబేరుడు, కానిస్టేబుల్‌ సీనానాయక్‌, ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.