అక్షరటుడే ఇందూరు: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో ఒకే రోజు 26 మంది విద్యార్థులు డిబార్ కావడం చర్చనీయాశంగా మారింది. ఇంటర్ బోర్డుకు చెందిన ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు జిల్లాలో మంగళవారం తనిఖీలు చేశాయి. కాగా రెండు కేంద్రాల్లో ఇంత మంది విద్యార్థులు చూచిరాతలకు పాల్పడి చిక్కడం గమనార్హం. ఇంటర్ పరీక్షల్లో మొదటి నుంచి మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలున్నా యి. అయినప్పటికీ జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నట్లు సమాచారం. ముఖ్యంగా పలు కార్పొరేట్ కళాశాలలకు మేలు చేసేలా బోర్డు అధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ పెద్ద ఎత్తున సాగుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఫిర్యాదులు చేసినా అధికారులు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది.
రెండు కేంద్రాల్లోనే..
ఇంటర్ బోర్డు ప్రత్యేక ఫ్లయింగ్ స్వ్కాడ్ తనిఖీల్లో భాగంగా మోర్తాడ్, ధర్పల్లి ప్రభుత్వ కళాశాల పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. చీటీలు దొరకడంతో విద్యార్థులను డిబార్ చేశారు. మోర్తాడ్‌లో 16, ధర్పల్లిలో 9 మంది, నిజామాబాద్‌లోని ఆదర్శ హిందీ విద్యాలయం సెంటర్‌లో ఒకరు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ బృందాలకు చిక్కారు.
జిల్లా బృందాలు ఏం చేస్తున్నట్లు..!
పరీక్షల పర్యవేక్షణ కోసం డీఐఈవో రఘురాజ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో మూడు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరు నిత్యం ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ చేయాల్సి ఉండగా.. తూతూ మంత్రంగానే పర్యవేక్షణ చేశారు. ఇప్పటి వరకు కేవలం నలుగురు విద్యార్థులను మాత్రమే డిబార్ చేశారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల, ఖిల్లా బాలుర జూనియర్ కళాశాల సెంటర్లలో పరీక్ష ముగిసిన వెంటనే అనేక చీటీలు కేంద్రం సమీపంలో కనిపించినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. పరీక్షలు ముగింపు దశకు చేరుకున్న వేళ మాస్ కాపీయింగ్ కేసులు పెద్దఎత్తున నమోదు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.