అక్షరటుడే, వెబ్ డెస్క్: ధంతేరస్.. ధన త్రయోదశి.. యమ త్రయోదశి.. ఇలా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆచారాలకు అనుగుణంగా పిలిచే ప్రత్యేకమైన ఈ వేడుకను నేడు (మంగళవారం) జరుపుకోనున్నారు. దీపావళి పండుగకు ముందు వచ్చే త్రయోదశి రోజున ధంతేరస్ ను నిర్వహించుకుంటారు. ఈ రోజున ధన్వంతరిని, సంపద, శ్రేయస్సు కలిగించే లక్ష్మీదేవిని పూజిస్తారు. ‘ధన్’ సంపదను సూచిస్తే.. ‘తేరాస్’ కృష్ణపక్షంలోని పదమూడో రోజును సూచిస్తుంది. అయితే ఈ రోజున బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేందుకు శుభదినంగా పరిగణిస్తారు. నిజానికి ఆరోగ్యానికి మించిన సంపద మరేదీ లేదని, ఇది కేవలం స్వర్ణ వర్తకులు చేసే ప్రచారంగా కొందరు పేర్కొంటారు. అయితే ధంతేరస్ వేడుక వెనుక కొన్ని పురాణాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

ధన్వంతరి పుట్టుక..

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని , ఆరోగ్యమే అసలైన సంపదగా భావించి ధన త్రయోదశిగా నిర్వహించుకుంటారు.

లక్ష్మీదేవి ఉద్భవించిన రోజుగా..

క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించగా.. శ్రీ మహావిష్ణువు ఆమెను అశ్వయుజ బహుళ త్రయోదశి నాడు సంపదకు అధిదేవతగా ఆమెను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవి జన్మించిన రోజుగా.. ఆమెను కొలిచేందుకు సంపదను సమకూర్చే ఆనవాయితీ కొనసాగుతోంది.

భూమండలానికి ఆగమనం

వైకుంఠంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో వచ్చిన భృగు మహర్షి తన రాకను గమనించలేదని శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు. తన నివాస ప్రాంతమైన వక్షస్థలాన్ని తన్నడంతో లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనైంది. కానీ శ్రీమహావిష్ణువు మృగ మహర్షిని శిక్షించకపోవడంతో అలకబూనిన లక్ష్మీదేవి భూ మండలానికి వెళ్లిపోతుంది. అలా భూలోకానికి అశ్వయుజ బహుళ త్రయోదశి నాడు లక్ష్మీదేవి వెళ్లిపోవడంతో.. ఆమెను ఆహ్వానిస్తూ ధంతేరస్ వేడుకలు నిర్వహించుకోవడం మరో ఆనవాయితీగా పేర్కొంటారు.

యమ త్రయోదశిగా..

మరో కథనం ఏంటంటే.. ఓ రాకుమారుడిని వరించిన రాకుమారి అతని పెళ్లి చేసుకుంటుంది. కాగా.. పెళ్లి జరిగిన నాలుగు రోజులకే ఆ రాకుమారుడు మరణిస్తాడని జ్యోతిష్య పండితులు రాకుమారికి చెబుతారు. సరిగ్గా నాలుగో రోజు ఆ రాకుమారుడి వాకిట బంగారు రాశులు పోసి.. దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మిని ధ్యానిస్తుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వామరూపంలో వేంచేసిన యమధర్మరాజు.. దీపావళి వెలుగులో బంగారు కాంతిని, లక్ష్మీదేవి ధ్యానిస్తున్న తీరును చూసి మైమరచిపోయి అలానే ఉండిపోతాడు. అలా యమ గడియలు దాటిపోవడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి పోయాడని మరో కథనం. అందుకే ధన త్రయోదశి నాడు సంపదను రాశులుగా పోసి దీపాలు వెలిగిస్తే మృత్యు దోషాలు తొలగిపోతాయని ప్రచారంలో ఉంది.

సమ్మిళిత వ్యాపారం

మొత్తానికి ధంతేరస్ వేడుకకు కారణం ఏదైనా.. ఈ వేడుక సందర్భంగా ఆ దేశంలో సమ్మిళిత వ్యాపారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల విక్రయాలు అధికంగా ఉంటాయి. వీటిని కొనుగోలు చేసిన వినియోగదారులు సంబరాల్లో మునిగిపోతుంటే.. వ్యాపారాలు ఆర్థిక వృద్ధి పొందుతుంటారు.