అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం పెద్దవాగు సమీపంలోని మూలమలుపు వద్ద ధాన్యం లారీ బోల్తాపడడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐలాపూర్ గ్రామానికి చెందిన మౌనిక కుమార్తెతో కలిసి సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్డు పక్కకు నిలబడ్డారు. లింగంపేట నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ధాన్యం లారీ అదుపుతప్పి పెద్దవాగు సమీపంలోని మూలమలుపు వద్ద బోల్తా పడింది. అక్కడే ఉన్న తల్లీకూతుళ్లపై ధాన్యం బస్తాలు పడ్డాయి. దీంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చిన్నారిని బయటకు తీశారు. చిన్నారి సురక్షితంగా బయట పడగా.. మహిళకు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు.