అక్షరటుడే, ఆర్మూర్: ముప్కాల్ గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బొల్లి సన్నీ(20) మృతి చెందారు. ముప్కాల్ ఎస్సై కథనం ప్రకారం.. ముప్కాల్ కు చెందిన బొల్లి సన్నీ, అతని స్నేహితులు అన్నేపాక గోపి, చెన్నూరు అరవింద్ కలిసి ఒకే బైక్ పై గ్రామ శివారులోని పెట్రోల్ బంకుకు వెళ్లారు. పెట్రోల్ పోసుకొని గ్రామానికి తిరిగి వస్తుండగా గోపి బైకు నడుపుతున్నాడు. లక్ష్మి కెనాల్ బ్రిడ్జి వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో వాహనంపై ఉన్న సన్నీ, అరవింద్, గోపిలకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ లో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం బొల్లి సన్నీ మృతిచెందినట్లు ఎస్సై రజినీకాంత్ తెలిపారు. మిగతా ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.