అక్షరటుడే, వెబ్‌డెస్క్: నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆర్వో నరేందర్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తదుపరి విచారణను వేగవంతం చేసింది. ఈక్రమంలో జైలులో ఉన్న నరేందర్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న రెవెన్యూ సూపరింటెండెంట్, ఇన్‌ఛార్జి ఆర్వో నరేందర్‌ను అక్రమాస్తుల కేసులో ఇటీవల ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడుల్లో భాగంగా నరేందర్ ఇంట్లో రూ.6 కోట్ల పైచిలుకు అక్రమాస్తులు గుర్తించారు. ఇందులో రూ.2.93 కోట్ల నగదుతో పాటు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే 17 స్థిరాస్తి తాలుకా పత్రాలను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ మొదలుపెట్టారు. నరేందర్‌తో పాటు కుటుంబీకుల పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని వివిధ బ్యాంకుల బ్రాంచ్ అధికారులకు లేఖలు రాశారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖకు సైతం లేఖలు రాసినట్లు తెలిసింది. నరేందర్ పేరిట ఉన్న స్థిరాస్తుల పూర్తి వివరాలు అందజేయాలని కోరినట్లు సమాచారం.
బినామీలు ఎవరు..?
నరేందర్ ముందు జాగ్రత్తగా తన బినామీల పేరిట ఆస్తులు దాచుకున్నట్లు ప్రచారంలో ఉంది. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వైద్యుడు, మరో ఇంజినీర్ పేరిట ఆస్తులు దాచి ఉంచారనే ప్రచారం కొనసాగుతోంది. అలాగే మహారాష్ట్రలో కూడా ఖరీదైన స్థలాలున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటిపైనా ఏసీబీ ఫోకస్ పెట్టింది. గతంలో నిజామాబాద్ కలెక్టరేట్‌కు సమీపంలో ఓ ఖరీదైన స్థలాన్ని వైద్యుడు మరో ఇంజినీర్‌తో కలిసి నరేందర్ కొనుగోలు చేశారని, సదరు స్థలాన్ని ఓ మాజీ ప్రజాప్రతినిధి తక్కువ ధరకు తీసేసుకున్నారని తెలిసింది. అడ్డదారిలో వచ్చిన సొమ్ముతో నరేందర్ రియల్‌ఎస్టేట్‌లోనూ పెట్టుబడులు పెట్టడం చర్చకు తావిచ్చింది. వీటన్నింటిపైనా ఏసీబీ విచారణ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.