అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ : వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అక్టోబర్‌లో కేంద్రాలు ప్రారంభించనున్నట్లు అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన శనివారం సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కొనుగోళ్లకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఈసారి ఖరీఫ్‌లో సుమారు 4.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని, 11.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా వేశామన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం 85 శాతం ఉందన్నారు. రైతులు తమ సొంత అవసరాల కోసం, ఇతర ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయాలు జరిపే ధాన్యాన్ని మినహాయిస్తే, కొనుగోలు కేంద్రాలకు సుమారు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యాన్ని తరలించే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 480 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్రాల్లో రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైన గన్నీ బ్యాగులను అన్ని కేంద్రాలకు సమకూరుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్డీవో సాయాగౌడ్‌, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, సివిల్‌ సప్లయిస్‌ డీఎం రమేష్‌, డీసీవో శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి గంగూబాయి, డీపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.