అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KV |కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 7వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్)లో ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదవొచ్చు.
KV |లాటరీ ద్వారా ఎంపిక
2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి ప్రవేశాలకు ఈ నెల 7 నుంచి 21 వరకు దరఖాస్తు స్వీకరిస్తారు. ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31 నాటికి 6 నుంచి 8 ఏళ్ల వయసున్న విద్యార్థులు అర్హులు. దరఖాస్తులను పరిశీలించి, లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
KV | వీరికి ప్రాధాన్యం..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగుల చిన్నారులకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు అలాట్ చేస్తారు. పాఠశాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పిల్లల కోసం పది సీట్లు కేటాయిస్తారు.
KV | రిజర్వేషన్లు ఇలా..
కేవీ ప్రవేశాలలో ఎస్సీలకు 15శాతం, ఎస్టీ విద్యార్థులకు 7.5శాతం, ఓబీసీలకు 27శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. నిబంధనల లాటరీ పద్ధతిలో సీట్ల కేటాయింపు ఉంటుంది. విద్యార్థుల ఎంపికకు సంబంధించి తొలి జాబితా ఈ నెల 25న, రెండో జాబితా ఏప్రిల్ 2న, మూడో జాబితా ఏప్రిల్ 7న వెలువడుతుంది.
KV | ఎంపిక విధానం..
ఆన్‌లైన్ దరఖాస్తులను పరిశీలించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఎంపిక జాబితా విద్యాలయాలకు పంపుతుంది. దీనిని సంబంధిత వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. జాబితాలో ఉన్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాఠశాలకు వెళ్లాలి. జనన, కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
KV | నర్సరీలోనూ..
దేశంలోని పలు కేంద్రీయ విద్యాలయాల్లో నర్సరీ(బాల వాటిక)లోనూ ప్రవేశాలు స్వీకరిస్తున్నారు. బాలవాటికలో ప్రవేశాలకు మూడు నుంచి ఐదేళ్ల వయసు ఉండాలి. అలాగే రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను సైతం భర్తీ చేస్తారు. అయితే వీటికోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యాలయాల్లో ఖాళీలు ఉంటే సంబంధిత ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు అందించాలి.