అక్షరటుడే, హైదరాబాద్: AI ఆధారిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సగం ఉద్యోగులతోనే డబుల్ రెవెన్యూ సాధించాలని టీమ్ కు లక్ష్యం విధిస్తున్నామని HCL టెక్ CEO విజయ్ కుమార్ చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. Infy CEO సలిల్ పారేఖ్ ఆయనతో ఏకీభవించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కంపెనీలన్నీ AI దారి పడితే.. సగం మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఇంటి బాట పట్టాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
AI రాకతో టెక్కీ ఉద్యోగుల గుండెల్లో గుబులు పట్టుకుంది. కృత్రిమ మేధతో భవిష్యత్తులో ఉద్యోగాలకు గండి పడుతుందనే ప్రచారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా ప్రముఖ టేక్ కంపెనీల సీఈవోల వ్యాఖ్యలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒక్కొక్కరు ఇలా AIకి వత్తాసు పలుకుతుండడం చూస్తుంటే.. ఉద్యోగులు ఇంటి బాట పట్టక తప్పదని తెలుస్తోంది. అతి ప్రధానంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఉపాధికి ముప్పు పొంచి ఉంది.
AI : తగ్గిన ప్రాజెక్టులు..
వెస్ట్ నుంచి ఇప్పటికే ప్రాజెక్టులు తగ్గి రెవెన్యూ మందగించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కంపెనీలన్నీ AI దారి పడితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డు పరిస్థితులు తప్పవు. చాలా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ బాట పట్టాయి. తాజాగా ఇన్‌మోబి సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్‌ను తమ సంస్థ సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది పూర్తయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలు పోతాయని వెల్లడించారు. ఇప్పటికే 50 శాతం సాధించామన్నారు. మెషీన్ కోడింగ్ వేగంగా, మెరుగ్గా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకుంటేనే మనుగడ సాధిస్తారని పేర్కొన్నారు.