అక్షరటుడే, బాన్సువాడ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు డిమాండ్ చేశారు. చలో హైదరాబాద్ పిలుపు మేరకు సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని మాతా శిశు ఆస్పత్రి కార్మికులు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నాకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. రెండు నెలల బకాయి వేతనాలు గుత్తేదారు చెల్లించాలని, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు కార్మికులకు అందజేయాలని కోరారు. మహిళా కార్మికులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తరలివెళ్లిన వారిలో రేణుక, సురేఖ, రజియా బేగం, కాశీరాం, గంగారాం, రాజు, సంగీత, పోశవ్వ తదితరులున్నారు.