అక్షరటుడే, ఇందూరు: ప్రధాని మోదీ పాలనలో రైతుల 40 ఏళ్ల పసుపు బోర్డు కలను తాను సాకారం చేశానని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. బోర్డు కోసం రైతులు దశాబ్దాలుగా పోరాటాలు చేయగా మోదీ హయాంలో సాధ్యమైందన్నారు. బీజేపీది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గన్నారం, ధర్మారం మండలాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ రైతు ‘భరోసా’ ఇస్తలేదని… రైతు ‘బంధు’ పెట్టిందని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలుపై కంటే రియల్ ఎస్టేట్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాడన్నారు. కాంగ్రెస్‌వి అన్నీ వట్టి మాటలేనని విమర్శించారు. బీజేపీ హయాంలో 2014కు ముందు నిజామాబాద్‌లో ఒక్క ఆర్వోబీ ఉంటే, ప్రస్తుతం ఆరుకు చేరుకున్నాయన్నారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ మళ్లీ రిజర్వేషన్ కథ, గల్ఫ్ బోర్డ్ తెరపైకి తెచ్చిందన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల్లో ఐపీఎఫ్ సంస్థను ఏర్పాటు చేసిందన్నారు. ప్రవాస భారతీయులకు 24 గంటలు సేవ చేయటానికి ముందుంటుందన్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఐపీఎఫ్ 8 విమానాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇటీవల దుబాయ్‌లో వరదల్లో చిక్కుకున్న వారికి రేషన్, నిత్యావసర సరుకులు అందజేసిందని తెలిపారు. నిజామాబాద్‌లో 30 ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ భారత్ ఉందన్నారు. భవిష్యత్తులో మహిళా సంఘాలకు డ్రోన్లను అందజేస్తుందని, వాటిని రైతులకు అద్దెకిస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందన్నారు. సీఏఏపై జీవన్ రెడ్డి స్టాండ్ ఏమిటని ప్రశ్నించారు. జనాభా నియంత్రణ కోసం యూసీసీ ఎంతో అవసరమన్నారు. హిందువులకు ఈ ఎన్నికలు చాలా కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నాయకులు పాల్గొన్నారు.