అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారా..? నంబర్ ప్లేటు లేకుండా బైకులు తిప్పుతున్నారా..? డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా..? ఇకపై అవి కుదరవు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో (పోలీసులు – రవాణా శాఖ అధికారులు) కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వచ్చేవారం నుంచి తనిఖీలు మొదలు పెట్టనున్నారు. నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయనున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే..
వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోయినా.. తారుమారు చేసినా.. సక్రమంగా లేకపోయినా కేసులు నమోదు చేయడంతో వాహనాలను సీజ్ చేయనున్నారు. అలాగే మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే డ్రంకన్ డ్రైవ్ కేసులు పెట్టనున్నారు. సెకండ్ హ్యాండ్‌లో బండికొని ఓనర్‌షిప్ మార్చుకోకపోకపోతే చర్యలు తీసుకోనున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు నమోదు చేయనున్నారు. త్రిబుల్ రైడింగ్, రాంగ్ రూట్‌లో నడిపినా భారీగా జరిమానాలు విధించనున్నారు. అలాగే హైవేలపై అనుమతిలేని స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసినట్లయితే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్ల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయనున్నారు.