అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ గేటుకు ఓ గుత్తేదారు తాళం వేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ దుకాణ సముదాయ నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లింపులో జాప్యం చేస్తున్నారని గుత్తేదారు విజయ్ నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి డీపీవో శ్రీనివాస్ రావు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న విజయ్ తన బిల్లుల చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ.. గ్రామ పంచాయతీ ప్రధాన గేటుకు తాళం వేశారు. రూ.30 లక్షలు ఖర్చు పెట్టి భవనాన్ని నిర్మిస్తే రూ.20 లక్షల బిల్లు చెల్లించారని, మిగతా పది లక్షలు విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపాడు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అధికారుల ముందు వాపోయాడు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తానని డీపీవో హామీ ఇచ్చారు.