అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని మేయర్ నీతూకిరణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే రంగులు మారుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో గురువారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 9న పంట రుణమాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. ఎన్నికల్లో గెలవగానే వంద రోజులంటూ నాటకం ఆడుతోందని మండిపడ్డారు. అది ముగియగానే ఆగస్టు 15లోపు మాఫీ చేస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. వరికి బోనస్‌పై కూడా మాట మార్చడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నాయకులు సిర్ప రాజు, ప్రభాకర్‌రెడ్డి, గాండ్ల లింగం, నీలగిరి రాజు తదితరులు పాల్గొన్నారు.