అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. కిటికీ తొలగించి ఇంట్లో చొరబడిన దొంగలు పెద్దఎత్తున బంగారం, నగదు అపహరించారు. అయితే ఆ సమయంలో కుటుంబీకులు ఇంట్లోనే ఉండడం గమనార్హం. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి నగరంలోని కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ పడక గదిలో నిద్రించగా.. అర్థరాత్రి సమయంలో మరో పడక గది కిటికీని ధ్వంసం చేసిన దొంగలు లోనికి ప్రవేశించారు. అల్మారాలో దాచి ఉంచిన 30 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం లేచేసరికి అల్మారా తెరిచి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.