అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలిస్‌ వజ్‌ ఆర్‌ అన్నారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సీబీసీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌తో కలిసి రిబ్బన్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుంది. అనంతరం అబ్జర్వర్‌ మాట్లాడుతూ ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని సూచించారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి, అభివృద్ధికి పునాది లాంటిదన్నారు. డెమోక్రసీని కాపాడుకునే ఆయుధమన్నారు. కార్యక్రమంలో సీబీసీ ఫీల్డ్‌ పబ్లిసిటీ ఆఫీసర్‌ బి.ధర్మ నాయక్‌, ఆర్టీసీ ఆర్‌ఎం జానీరెడ్డి, స్వీప్‌ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ సురేష్‌ కుమార్‌, డీడబ్ల్యూవో ఎస్‌కే రసూల్‌ బి, నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్‌ ఆఫీసర్‌ శైలి బెల్లాల్‌ పాల్గొన్నారు.