అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: కాలూర్‌కు చెందిన నాలుగు నెలల గర్భిణి మృతి చెందడంతో.. బంధువులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలూర్‌కు చెందిన వివాహిత(30) నాలుగు నెలల గర్భిణి. శనివారం ఉదయం కడుపునొప్పి రావడంతో నగరంలోని వీక్లి మార్కెట్లో గల ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యురాలి సూచన మేరకు స్కానింగ్ చేయించారు. రిపోర్ట్స్ పరీక్షించిన డాక్టర్ కడుపులో బిడ్డ చనిపోయిందని చెప్పింది. పిండాన్ని కడుపులో నుంచి తీసేందుకు అబార్షన్ అవసరంలేదని.. టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. వైద్యురాలి సూచన మేరకు ట్యాబ్లెట్స్ వేసుకుంది. అయితే శనివారం రాత్రి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళన చెందిన ఆమె భర్త వెంటనే ఆస్పత్రికి ఫోన్ చేశాడు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. కొబ్బరిబోండం, నీళ్లు తాగించాలని సూచించారు. ఉదయం అయినా పరిస్థితి కుదుటపడకపోవడంతో ఆమెను ఆదివారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన వైద్యురాలు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. హాస్పిటల్ వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.