అక్షరటుడే, ఆర్మూర్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తేనే స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం వెల్మల్ గ్రామంలో ప్రజలతో చాయ్‌పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడారు. ప్రతిఒక్కరికి పని కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోందని వివరించారు. అంతేకాకుండా ఇటీవల కూలి రేటును కూడా పెంచిందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇళ్లు, నూతన పెన్షన్లు ఇప్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అధికారులతో కలిసి ఒక రోజు పల్లె నిద్ర చేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో అర్వింద్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.