అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహిస్తూ తుది దశకు చేర్చారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. ఇదే స్ఫూర్తితో లక్ష్యానికనుగుణంగా సేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌తో కలిసి ఆర్మూర్‌ మండలం ఫత్తేపూర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని సూచించారు. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో ఇంకా సుమారు 23 చోట్ల కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్‌ ఎంట్రీలను పూర్తి చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతుందన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌, డీఎస్‌వో చంద్రప్రకాశ్‌, సివిల్‌ సప్లయ్స్‌ డీఎం జగదీశ్‌, డీసీవో శ్రీనివాస్‌ తదితరులున్నారు.