అక్షరటుడే, ఇందూరు: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు పాశుపతాస్త్రమే.. మీరు వేసే ఓటు మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయడం తమ బాధ్యతగా గుర్తించాలి. నేనొక్కడిని ఓటేయకుంటే మునిగిపోయేదేముందిలే.. ఫలితం ఏమైనా తారుమారవుతుందా..? నేను ఓటేయకపోతే వచ్చే నష్టమేముంది..? అంటూ చాలా మంది ఓటును నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా యువతలో కొందరు ఓటేసేందుకు ఆసక్తి చూపడం లేదని ఎన్నికల చరిత్ర స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని వారిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం ‘స్వీప్’ (సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని.. భవిష్యత్ తరాలకు బాటలు వేద్దాం.
గత ఎంపీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్‌లో అత్యల్ప ఓటింగ్
ఎక్కువ శాతం యువత ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో, ఊర్లలో నివసిస్తుంటారు. ప్రస్తుతం మూడు రోజుల సెలవు రావడంతో ఓటు వేసేందుకు సొంతూర్లకు వచ్చేందుకు ఇది మంచి అవకాశం. ప్రతిసారి నిజామాబాద్‌లో 60 నుంచి 65 శాతం మాత్రమే పోలింగ్ నమోదవుతుంది. గత లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్‌లోనే అతి తక్కువగా 56.25 ఓటింగ్ శాతం నమోదైంది. పూర్తిస్థాయిలో యువత ముందుకు వచ్చి ఓటేస్తే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది.