అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నగరంలోని గాయత్రినగర్‌ రోడ్డులో సోమవారం రాత్రి అటవీ అధికారులు కలపను సీజ్‌ చేశారు. ఓ ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా.. కలపను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో మోపాల్‌ మండలంలోని ఓ తండావాసులు, అటవీ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. తమకు అటవీశాఖ అధికారి సహకారం ఉందని, ఆయన కోసం తాము ఎన్నోసార్లు కలప తరలించామని వారు ఆరోపించారు. ఆ అధికారి ఎవరన్నదానిపై స్పష్టత లేదు. మరోవైపు వారి ఆరోపణలను అటవీ అధికారులు కొట్టిపారేశారు. కలపను అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకుని కేసునమోదు చేయడం వల్లే నిరాధార ఆరోపణలు చేశారని అటవీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి మంచిప్ప, కాల్పోల్‌, మల్లారం అటవీ ప్రాంతాల నుంచి నిత్యం చీకటి పడగానే పెద్దమొత్తంలో కలప అక్రమ రవాణా జరుగుతోంది. సైకిళ్లు, ఆటోల్లో టేకు దుంగలను సామిల్లులకు తరలిస్తున్నారు. అక్రమ రవాణాపై అటవీ సిబ్బంది నిఘా పెంచాల్సి ఉంది. ముఖ్యంగా బీట్‌ సిబ్బంది పక్కా పర్యవేక్షణ లేకపోవడం వల్లే కలప అక్రమ జరుగుతున్నట్లు సమాచారం.