అక్షరటుడే, జుక్కల్: వరి ధాన్యం కొనుగోలు చేయాలని బుధవారం రైతులు రోడ్డెక్కారు. మహమ్మద్‌నగర్‌లో బోధన్ – హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు కోమలంచ వద్ద ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే నిర్వాహకులు తమను పట్టించుకోవడంలేదని రోడ్డుపై భైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో తూకాలు మందకొడిగా సాగడంతో పాటు సమయానికి లారీలు రావడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కుప్పలుగా పోశామని పేర్కొన్నారు. తూకాలు వేసిన ధాన్యం బస్తాలు లారీలు రాకపోవడంతో కేంద్రాల్లోనే ఉండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. వెంటనే ధాన్యం తూకాలు వేగవంతం చేయాలని రహదారిపై నిద్రించి నిరసన తెలిపారు. దీంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.