అక్షరటుడే, ఇందూరు: జిల్లాలోని పలు చోట్ల మంగళవారం అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు పిడుగులు పడ్డాయి. దీంతో నగరంతో పాటు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరి థియేటర్ ప్రాంగణంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగి చెట్టు దగ్ధమైంది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. చెట్టుకు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. అలాగే నగరంలోని మార్కెట్ యార్డులో ధాన్యం సంచులు తడిచిపోయాయి.