అక్షరటుడే, వెబ్‌డెస్క్: నగరంలోని ఆరో టౌన్ పరిధిలో పోకిరీలు హల్‌చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసు సిబ్బంది చొక్కా పట్టుకుని విధులకు ఆటంకం కలిగించారు. వివరాల్లోకి వెళ్తే.. సారంగపూర్ సమీపంలోని అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ హోటల్ తెరిచి ఉండగా పలువురు యువకులు అక్కడికి భోజనం చేసేందుకు వెళ్లారు. అనంతరం బిల్లు కట్టకుండా తిరిగి డయల్ 100కు కాల్ చేశారు. అర్ధరాత్రి దాటినా హోటల్ తెరిచి ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆరో టౌన్ ఏఎస్సై, ఓ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లారు. వాస్తవ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తమను తప్పుదోవ పట్టించిన యువకులను వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు కానిస్టేబుల్‌పైనే దాడికి యత్నించాడు. బూతులు మాట్లాడుతూ.. కానిస్టేబుల్ గల్లా పట్టుకుని విధులకు ఆటంకం కలిగించాడు. ఎట్టకేలకు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఎస్‌హెచ్‌వో లేక..
నిజామాబాద్ ఆరో టౌన్‌కు కొద్ది రోజులుగా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ లేరు. దీంతో ఈ స్టేషన్ పరిధిలో పాలన గాడితప్పింది. ముఖ్యంగా అర్ధరాత్రిళ్లు హోటళ్లు తెరిచి ఉంటున్నాయి. గతంలో ఈ స్టేషన్ పరిధిలో వరుస కత్తిపోట్ల ఘటనలు జరిగాయి. చాలా కీలకమైన స్టేషన్‌కు రోజుల తరబడి పూర్తిస్థాయి ఎస్సైను నియమించకపోవడం గమనార్హం. మరోవైపు అర్ధరాత్రిళ్లు హోటల్స్ నడిపిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.