అక్షరటుడే, జుక్కల్‌: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి సూచించారు. ఆయన సోమవారం నిజాంసాగర్‌ మండలం అచ్చంపేట సొసైటీ పరిధిలోని బంజపల్లి, గోర్గల్‌ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, తాగునీటి సౌకర్యం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అచ్చంపేట సొసైటీ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు, ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిందా? రైతులకు డబ్బులు ఖాతాలో జమవుతున్నాయా? అనే వివరాలను ఆరా తీశారు. ఆయన వెంట గిర్దవార్‌ అంజయ్య, సివిల్‌ సప్లయ్స్‌ డీటీ సురేష్‌, సీఈవో సంగమేశ్వర్‌ గౌడ్‌ తదితరులున్నారు.