అక్షరటుడే, కామారెడ్డి: నులిపురుగుల నివారణే ధ్యేయంగా పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ముదాంపల్లిలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడుపులో నట్టలు ఉంటే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి వంటి వాటితో బాధపడతారన్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశభవిశ్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి, జూన్ మాసాల్లో రెండు పర్యాయాలు అల్బెండజోల్ మాత్రలు ఇస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 19 ఏళ్లలోపు 2,50,254 పిల్లలున్నారని గుర్తించామని వారికి మాత్రలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ, వైస్ చైర్ పర్సన్ వనిత, కౌన్సిలర్ ప్రముఖ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి చంద్రశేఖర్, డీఈవో రాజు, ఎంఈవో ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ నిర్వహించారు. పాఠశాలలు, అంగన్ వాడీల్లో పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేశారు.