అక్షరటుడే, వెబ్డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా అమలు చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాలకు పరిమితం చేయడం సరికాదన్నారు. అభివృద్ధి ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని ఆయన సూచించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణపై చిన్నచూపు సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం తమ సొంత నియోజకవర్గాల్లోనే అభివృద్ధి చేసుకుంటే ఇతర నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి డిమాండ్ చేసిన విధంగా ఆర్మూర్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇంటిగ్రేటెడ్ పాఠశాలను కేటాయించాలని కోరారు. అలాగే నిజాంషుగర్స్, జక్రాన్పల్లి ఎయిర్పోర్టు ఏర్పాటు అంశాలు పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చిస్తామన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి రాష్ట్రంలో బలమైన గొంతుకగా మారుతున్నారని పేర్కొన్నారు. సీఎంను కలిసి చర్చించే వరకు.. నిరహార దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాకేశ్ రెడ్డికి సూచించారు. తాము కలిసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి స్పందించకపోతే తప్పనిసరిగా రోడ్డెక్కుతామని అర్వింద్ స్పష్టం చేశారు.