అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కంపల్లి సెజ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10వ తేదీన రాత్రి విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరించింది. ముక్కుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నందిపేట పీహెచ్‌సీలో టీకాలు ఇప్పించుకున్నాడు. తిరిగి యథావిధిగా విధులకు వెళ్తున్నాడు. అయితే గురువారం రాత్రి డ్యూటీలో ఉండగా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం మహేశ్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నాడు. మరోవైపు వరుస కుక్కకాటు ఘటనలు జరుగుతున్నా అధికారులు స్పందించట్లేదు. మనుషుల ప్రాణాలు పోతున్నా వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.