అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్‌ పార్టీ దొంగ వాగ్ధానాలు చేసి గెలిచిందని.. అధికారంలోకి వచ్చాక బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని ఎంపీ అరవింద్‌ ధర్మపురి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ సైతం ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి.. కనిపించకుండా పోయారన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల మాదిరి బీజేపీ దొంగ వాగ్ధానాలు చేయబోదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు, 16 వ్యారంటీలకు విలువలేదన్నారు. ప్రధాని మోదీ గ్యారంటీ ఒక్కటే.. పక్కా గ్యారంటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హిందూ వ్యతిరేక పార్టీ అని.. మన సాంప్రదాయాలు, పద్ధతులను మారుస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ కంటే బ్రిటిష్‌ వాళ్లే నయమన్నారు. అవినీతికి తావులేకుండా పాలన కొనసాగుతుందని.. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే జైలుకు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ దోస్తీ అని ప్రచారం చేశారన్నారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్టు చేశాయని పేర్కొన్నారు. ఆమెకు ఇప్పట్లో బెయిల్‌ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా మీడియా నిజాలు చెప్పాలని కోరారు. ఈ ఎన్నికలు స్వతంత్ర భారతంలో అతి ముఖ్యమైనవని గుర్తు చేశారు. సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, ప్రధాన కార్యదర్శి ఎన్‌ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.