అక్షరటుడే, ఇందూరు: గల్ఫ్‌లో ఉన్న మన యువతను తిరిగి తీసుకొచ్చి ఉద్యోగాలను కల్పించడమే తన ప్రధాన ఎజెండా అని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. గతంలో మాదిరిగా గల్ఫ్ దేశాల్లో వేతనాలు లేవని పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. కేటీఆర్, రేవంత్ రెడ్డి హిందువులు, రామ మందిరంపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం అంశం ఉందని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్లుగానే అమలు చేశామని చెప్పారు. రేవంత్ రెడ్డి భక్తి గుండెల్లో ఉండాలి అంటూ అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని.. మరి ఇతర మతస్తుల మైక్ సౌండ్లు ఎందుకు బయటకు వినబడుతున్నాయని ప్రశ్నించారు. తమ పార్టీ ప్రత్యేకంగా ఒక వర్గానికి పథకాలను అందించదని.. హిందూ ముస్లిం తేడా లేకుండా అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రత్యేకంగా హామీలు ఇచ్చిందన్నారు. దేశంలో రిజర్వేషన్లు పెరుగుతాయి.. కానీ ఎన్నటికీ తరగవని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ముస్లింలు రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే గల్ఫ్ బోర్డు అంశం కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గుర్తొచ్చిందన్నారు. గల్ఫ్ బాధితుల కోసం తాను నడుపుతున్న కాల్ సెంటర్ ఏ ప్రభుత్వాలు కూడా నడపలేదన్నారు. తన సొంత డబ్బులతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. గల్ఫ్ బోర్డ్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని.. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కనీసం దాని ఊసు కూడా లేదని పేర్కొన్నారు. ఇక జిల్లాలో బీడీ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని.. కానీ వారికి గతంలో మాదిరిగా పని దినాలు లేవన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పని చేస్తోందన్నారు. స్వయం ఉపాధి పొందడానికి లోన్లు ఇవ్వడంతో పాటు ఐదు శాతం వడ్డీ రాయితీ కల్పిస్తోందన్నారు. రానున్న కాలంలో మహిళా సంఘాలకు డ్రోన్లను అందజేయనుందని తెలిపారు. వాటిని రైతులకు అద్దెకు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పందిస్తూ.. ఎఫ్‌సీఐ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కాదన్నారు. రైతులు ఊరుకునేవారు కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం వరికి రూ.500 బోనస్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవన్నారు. అంతేకాకుండా తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ప్రత్యర్థులు కావాలని తనపై అనవసరపు అబాండాలు వేస్తున్నారన్నారు. పార్టీ సీట్లు పెరిగితే.. గెలిస్తే అహం రాదు. నేను పుట్టినప్పటి నుంచి ఎలా ఉన్నానో అలాగే ఉంటున్నానని చెప్పారు.