అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ఎంపీ అరవింద్ ఎన్నికల్లో గెలిచాననే అహకారంతో కాంగ్రెస్ నేతలపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని.. తప్పుగా మాట్లాడితే తరిమికొడతామంటూ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలు చేసిందని అరవింద్ ఆరోపిస్తున్నారని.. కానీ ఎవరు మతం పేరిట, దేవుడి పేరిట ఓట్లు అడిగారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బీజేపీ నాయకులే మత రాజకీయాలు చేశారని విమర్శించారు. అరవింద్‌కు ధైర్యం ఉంటే డబ్బుల పంపిణీ, అభివృద్ధి, మతం పేరిట రాజకీయాలపై చర్చకు రావాలని.. కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మానాల సవాల్ విసిరారు. మామిడిపల్లి, మాధవనగర్ రైల్వే బ్రిడ్జిలను కూడా పూర్తి చేయించలేకపోయిన ఎంపీ అరవింద్.. మెడికల్ కాలేజీ, అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సుదర్శన్‌రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ స్థానంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కవడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువగా వచ్చాయని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఓడిపోతానని భావించిన అరవింద్ అదృష్టవశాత్తు గెలవడంతో అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు మచ్చలేని నాయలకున్నారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు పాల్గొన్నారు.