అక్షరటుడే, నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ నగర కీలక ప్రజాప్రతినిధి ఆమె భర్త కాంగ్రెస్‌లో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించట్లేదు. ఇందుకు వారిపై ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ హయాంలో భూకబ్జాల ఫిర్యాదులు ఉండడం, ఇటీవల మొరం అక్రమ తవ్వకాల అంశంలోనూ బైండోవర్‌ చేయడంతో హస్తం పార్టీ వారి చేరికకు బ్రేక్‌ వేసినట్లు తెలిసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత సదరు ప్రజాప్రతినిధి భర్త కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారు. ముఖ్యంగా వినాయక్‌నగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత ద్వారా పలువురిని కలిశారు. అయితే వారి చేరికను మొదటి నుంచి సుదర్శన్‌ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారితో తదుపరిగా పార్టీకి మచ్చ వచ్చే అవకాశాలున్నాయని, ఇప్పట్లో చేర్చుకోవడం వద్దని తేల్చిచెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ తర్వాత షబ్బీర్‌ అలీ, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌లు సైతం సానుకూలత వ్యక్తపర్చలేదు. చివరకు రాష్ట్రస్థాయిలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను సైతం కలిశారు. అయినప్పటికీ.. చేరికకు ఇంకా పచ్చజెండా రాలేదు. చివరకు ఇంటెలిజెన్స్‌ వర్గాలు సైతం వ్యతిరేకంగా రిపోర్ట్‌ ఇచ్చాయి. దీంతో అధికార పార్టీలో చేరాలనుకుంటున్న వారి కల ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనిపించట్లేదు. మరోవైపు బీఆర్‌ఎస్‌ తరపున పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గనట్లేదు. ఈ విషయం సొంత పార్టీ నేతలకు కూడా తెలియడంతో వారు సమయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.